తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఈ రోజు (మంగళవారం) అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు సిద్దమవుతున్నారు. ఈరోజు రాత్రిలోగా ప్రభుత్వం తమని చర్చలకు ఆహ్వానించకపోతే సమ్మె తప్పదని ఆర్టీసీ ఐకాస నేతలు స్పష్టం చేశారు.
సోమవారం హైదరాబాద్, బస్ భవన్ వరకు ‘కార్మిక కవాతు’ నిర్వహించి సభ నిర్వహించారు. సభలో ఆర్టీసీ ఐకాస ఛైర్మన్ ఈదురు వెంకన్న, కో ఛైర్మన్ హనుమంతు ముదిరాజ్, ధామస్ రెడ్డి తదితరులు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, “జనవరి 27న మన యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చాము. కానీ మూడు నెలలుగా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వారికి మన సమస్యల పరిష్కారించాలనే ఆసక్తి లేకపోవడం వల్లనే ఈవిదంగా వ్యవహరించారని భావిస్తున్నాము.
మేమేమీ కొత్తగా డిమాండ్ చేయడం లేదు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయాలని మాత్రమే కోరుతున్నాము.
ఆర్టీసీలో యూనియన్లు ఉండాలని అప్పుడే కార్మికుల సమస్యలు యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్ళగలుగుతారని ఇదివరకు రేవంత్ రెడ్డి అన్నారు కదా? ఆయన ముఖ్యమంత్రిగా 16 నెలలు గడిచినా యూనియన్లు ఎందుకు పునరుద్దరించలేదు?
మహాలక్ష్మి పధకంతో ఆర్టీసీ ఉద్యోగులపై పని భారం పెరిగిపోయిందని కనుక ఉద్యోగుల నియమాకాలు చేపట్టాలని, కొత్త బస్సులు కొనాలని మేము కోరుతుంటే, ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
మా చేత రోజుకు 16 గంటలు పనిచేయించుకుంటున్నప్పుడు మా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఉంటుంది కదా? కానీ మా సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదు?
మేము మా సమస్యల గుర్తు చేసి అడుగుతుంటే, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని చెప్పి తప్పించుకోవాలని అనుకోవడం సరికాదు.
కనుక ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిస్తే మేము సిద్దంగా ఉన్నాము. కానీ చర్చలు వద్దనుకుంటే ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మె తప్పదు,” అని ఆర్టీసీ ఐకాస నేతలు స్పష్టం చేశారు.