టిజిఎస్ ఆర్టీసీ ఉద్యోగులు జీతాల పెంపుతో సహా పలు డిమాండ్లతో మే 7 నుంచి నిరవధిక సమ్మెకు సిద్దమవుతున్నారు. సిఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఓసారి దయనీయంగా ఉన్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి వివరించి సమ్మె చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కానీ వారు సమ్మెకు సిద్దమవుతుండటంతో సోమవారం మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆయన ఏమన్నారో క్లుప్తంగా..
మా ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకే బిఆర్ఎస్ పార్టీ ఉద్యోగులను రెచ్చగొట్టి సమ్మెకు ఉసిగొల్పుతోంది. తెలంగాణ ఏర్పడక మునుపు అప్పులు, వడ్డీలకు ఏడాదికి రూ.7-8000 కోట్లు చెల్లించేవారు. ఇప్పుడు నెలకే అంత కంటే కాస్త ఎక్కువే చెల్లించాల్సి వస్తోంది.
ఈ అప్పులు తీర్చడం కొరకు ఈ 16 నెలల్లో రూ.1.58 లక్షల కోట్లు అప్పు చేశాం. దానిలో రూ.1.52 లక్షల కోట్లు అప్పులు, వడ్డీల చెల్లింపులకే సరిపోయింది.
రాష్ట్ర ఆదాయం నెలకు రూ.18,500 కోట్లు ఉంటే దానిలో సగం అప్పులు, వడ్డీలకే పోతోంది. మిగిలిన సొమ్ముతోనే ఉద్యోగుల జీతాలు, ప్రభుత్వ నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పధకాలు వగైరా కొనసాగించాల్సి వస్తోంది. అయినప్పటికీ ప్రతీ నెల 1వ తేదీన టిజిఎస్ ఆర్టీసీతో సహా ఉద్యోగుల జీతాలు చెల్లిస్తున్నాం.
మాజీ సిఎం కేసీఆర్ అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా అప్పులు చేశారు. ఏకంగా 11 శాతం వడ్డీకి రూ.50,000 కోట్లు అప్పులు తెచ్చారు. అదే అప్పుడు ఆయన ప్రభుత్వానికి గుది బండగా మారడంతో అత్యంత విలువైన భూములు అమ్మేశారు.
కొత్తగా రోడ్లు వేయడం కాదు కనీసం గుంతలు పడిన రోడ్లకు మరమత్తులు కూడా చేయించలేని దయనీయ స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. కనుక టిజిఎస్ ఆర్టీసీ ఉద్యోగులు బిఆర్ఎస్ పార్టీ మాటలు నమ్మి సమ్మెకు దిగొద్దు. ఒకవేళ దిగినా ఇప్పుడున్న పరిస్థితిలో జీతాలు పెంచలేము.
సమ్మె చేస్తే మీరు నష్టపోతారు, టిజిఎస్ ఆర్టీసీ, ప్రభుత్వం కూడా నష్టపోతుంది. కనుక పరిస్థితి చక్కబడే వరకు ఓపిక పట్టాలని సిఎం రేవంత్ రెడ్డి టిజిఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు.