తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ప్రభాకర్ రావుకి హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో ఆయనని రప్పించడం ఇక సాధ్యమేనా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ కేసులో తాను ఒక్కడినే ఫోన్ ట్యాపింగ్ చేయాలనే నిర్ణయం తీసుకోలేదని, రివ్యూ కమిటీ అనుమతితోనే చేశామని, దాని అనుమతితోనే సేకరించిన ఆ డేటాని ధ్వంసం చేశామని ప్రభాకర్ రావు హైకోర్టుకి సమర్పించిన పిటిషన్ ద్వారా తెలియజేశారు.
కనుక స్పెషల్ ఇంటలిజన్స్ బ్యూరోలో ఫోన్ ట్యాపింగ్, రికార్డుల ధ్వంసం రెండూ చట్టబద్దంగానే జరిగాయని, కానీ ఈ కేసులో తాను ఒక్కడినే బాధ్యుడినన్నట్లు ఈ కేసు విచారణ జరుపుతున్న సిట్ బృందం ఆరోపిస్తోందని ప్రభాకర్ రావు హైకోర్టుకి తెలియజేశారు.
దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణకు ప్రభాకర్ రావుని రప్పించలేకపోతున్నందున ఆయన చెప్పిన రివ్యూ కమిటీలో అధికారులను ప్రశ్నించి వివరాలు రాబట్టాలని సిట్ బృందం నిర్ణయించింది.
ఈ కమిటీలో2023లో పనిచేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖాకార్యదర్శి, సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శి సభ్యులుగా ఉండేవారు. కనుక వారికి నోటీసులు పంపించి ప్రశ్నించి వివరాలు రాబట్టాలని నిర్ణయించారు. ఈ తాజా ట్విస్ట్ కారణంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఎప్పటికీ ముగుస్తుందో ఎవరూ చెప్పలేరు.