తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలు జీతాల పెంపుతో సహా మరికొన్ని డిమాండ్లు ఆర్టీసీ యాజమాన్యం ముందు పెట్టాయి. కానీ ప్రభుత్వం, టిజిఎస్ ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో వారి డిమాండ్లన్నీ నెరవేర్చలేమని స్పష్టం చేశాయి.
కనుక టిజిఎస్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలు తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ సుమారు రెండు మూడు వారాల క్రితం మే 7వ తేదీ నుంచి సమ్మె చేయబోతున్నట్లు నోటీస్ ఇచ్చాయి.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఈరోజు మేడే సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన కార్మిక దినోత్సవ సభలో మాట్లాడుతూ, “గత ప్రభుత్వం 8.50 లక్షల కోట్లు అప్పులు చేసి పోయింది. లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మూడేళ్ళకె అది క్రుంగిపోయి వాడకానికి పనికిరాకుండా పోయింది. గత ప్రభుత్వం తెచ్చిన డబ్బంతా ఎక్కడికి పోయిందో లెక్క తేలడం లేదు.
కానీ ఈ పదేళ్ళలో కేసీఆర్ కుటుంబానికి సొంత టీవీ ఛానల్స్, పత్రికలు, ఫామ్‌హౌస్‌లు ఇంకా చాలా ఆస్తులు వచ్చాయి. అవన్నీ ఎలా సంపాదించారో చెప్పాలి?
కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతీనెల అసలు, వడ్డీల చెల్లింపులకే ప్రభుత్వం ఆదాయంలో సగం పోతోంది. మిగిలిన సొమ్ముతోనే ఉద్యోగుల జీతాలు, ప్రభుత్వ నిర్వహణ, అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నాము. వీటన్నిటికీ సర్దుబాటు చేయలేక ఇబ్బంది పడుతున్న మన ప్రభుత్వంపై టిజిఎస్ ఆర్టీసీ ఉద్యోగులు తమ డిమాండ్లతో ఇంకా ఒత్తిడి చేయడం సబబా?అని అడుగుతున్నాను.
మీ అందరికీ జీతాలు పెంచాలని, మీరందరూ సంతోషంగా ఉంటే చూడాలని మాకు మాత్రం ఉండదా?కనుక గతంలో మీ ఆర్టీసీ కార్మికుల చావులకు కారణమైన బిఆర్ఎస్ పార్టీని నమ్మకండి. ఆ పార్టీ నేతల చెప్పుడు మాటలు విని సమ్మె చేయకండి.
టిజిఎస్ ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కొలుకుంటోంది. ఇప్పుడు సమ్మె చేస్తే కధ మళ్ళీ మొదటికొస్తుంది. టిజిఎస్ ఆర్టీసీ ఉద్యోగులతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ని మీరు ఎప్పుడు కావాలనే అప్పుడు కలిసి ఆయనతో చర్చించవచ్చు.
కనుక ఆర్టీసీ ఉద్యోగులు కూడా పంతాలు, పట్టింపులకి పోకుండా చర్చల ద్వారా మీ సమస్యలని పరిష్కరించుకోవాలి,” అని సిఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.