ఇది సముద్రంలో తిరిగే తిమింగలం కాదు తెలంగాణలో అటు ప్రభుత్వం, ఇటు కాంట్రాక్టర్ల మద్య తిరిగే అవినీతి తిమింగలం. కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీగా చేస్తున్న భూక్యా హరిరామ్ ఆ తిమింగలం. ప్రస్తుతం అరెస్ట్ అయ్యి జ్యూడిషియల్ రిమాండ్ మీద జైల్లో ఉన్న ఆయనని తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల ఏసీబీ అధికారులు ఆయనకు సంబందించిన 14 చోట్ల ఒకేసారి దాడులు జరుపగా సుమారు రూ.250 కోట్లు విలువగల ఆస్తులు పోగేసినట్లు గుర్తించారు. వాటిలో హైదరాబాద్, శ్రీనగర్ కాలనీ, నార్సింగి, షేక్ పేట, కొండాపూర్, మాదాపూర్, మర్కూక్, పటాన్ చెరు, కుత్బుల్లాపూర్, బొమ్మలరామారం, మిర్యాలగూడ, కొత్తగూడెంలో ఇళ్ళు, విల్లాలు, వాణిజ్య సముదాయాలు, పొలాలు, తోటలు వంటివి అనేకం ఉన్నాయి.
భూక్యా హరిరామ్‌కు ఎంత దూరదృష్టి అంటే ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే అవుతుందని, అది చాలా అభివృద్ధి చెందుతుందని ముందే పసిగట్టి అక్కడ కూడా ముందే ఓ వాణిజ్యస్థలం కొని ఉంచుకున్నారు. ఏసీబీ అధికారులు గుర్తించని ఆస్తులు ఇంకెన్ని ఉన్నాయో?