తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీస్ ఇచ్చారు. కంచ గచ్చిబౌలి అటవీ భూములలో చెట్లను కూల్చివేస్తున్న జేసీబీల ఎదుట వన్య ప్రాణులు నిలబడినట్లు ఏఐతో సృష్టించిన ఫోటోలని ఆమె మార్చి 31న రీట్వీట్ చేస్తూ వాటి పరిస్థితి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
అటువంటి ఫేక్ ఫోటోలు, వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సిఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు బిఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు.
ప్రభుత్వం ఆదేశం మేరకు పోలీసులు పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు. కనుక స్మితా సభర్వాల్ కూడా వాటిని సమర్ధిస్తున్నట్లు రీ ట్వీట్ చేయడంతో గచ్చిబౌలి పోలీసులు ఆమెకు కూడా నోటీస్ ఇచ్చి వివరణ కోరారు.
ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణిగా పనిచేస్తున్న ఆమె నిజానిజాలు తెలుసుకోకుండా ఆ భూములలో వన్య ప్రాణులు చనిపోతున్నాయనే అభిప్రాయం ప్రజలకు కలిగించేలా చేసినట్లయింది. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతున్నట్లుగా అభిప్రాయం కలుగుతుంది.
ఇప్పటికే ఈ వ్యవహారంలో హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బలు తింటున్న ప్రభుత్వానికి ఆమెపై అసహనం కలగడం సహజమే. కానీ ఆమెకు కేవలం సంజాయిషీ కోరుతూ నోటీస్ మాత్రమే ఇచ్చాము తప్ప విచారణకు రమ్మనమని కోరలేదని సమాచారం. ఈవిధంగా జరుగుతుందని బహుశః ఆమె కూడా ఊహించి ఉండరు. కనుక ఇది ఆమెకు ఇబ్బందికరమే. దీనిపై ఆమె ఏమని వివరణ ఇస్తారో?