బిఆర్ఎస్ ఉచ్చులో చిక్కుకోవద్దు: కాంగ్రెస్‌

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూ వివాదంలో మూడు ప్రధాన పార్టీల మద్య జోరుగా రాజకీయాలు సాగుతూనే ఉన్నాయి. 

ఈ వ్యవహారంలో పెద్ద కుంభకోణం జరిగిందని త్వరలో దానిని సాక్ష్యాధారాలతో సహా బయటపెడతానని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హెచ్చరించారు. 

దీనిపై బీజేపి ఎంపీ, కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌ స్పందిస్తూ, “దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిజాయితీ నిరూపించుకునేందుకు సీబీఐ విచారణ కోరాలి,” అని డిమాండ్ చేశారు.    

ఈ భూ వివాదంపై బిఆర్ఎస్ పార్టీ ఏఐ టెక్నాలజీతో ఆ భూములలో అనేక వన్య ప్రాణులు జీవిస్తున్నట్లు, అవన్నీ చచ్చిపోతున్నట్లు ఫోటోలు సృష్టించి ప్రజలను రెచ్చగొడుతోందని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్ కుమార్‌ రెడ్డి ఆరోపించారు.

ఆ ఏఐ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై కోర్టులో కేసు వేయగానే కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో సహా పలువురు నేతలు తమ ఖాతాలలో నుంచి ఆ పోస్టులను డిలీట్ చేయడం గమనిస్తే, బిఆర్ఎస్ పార్టీ ఉచ్చులో బీజేపి నేతలు కూడా చిక్కుకున్నారని అర్దమవుతోందన్నారు.

కనుక ప్రజలు, బీజేపి నేతలు ఎవరూ బిఆర్ఎస్ పార్టీలో ఉచ్చులో చిక్కుకోవద్దని ఎంపీ చామల కిరణ్ కుమార్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.