దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుక్నగర్ బాంబు ప్రేలుళ్ళ కేసులో ఉరిశిక్ష పడ్డ ఐదుగురు దోషులకు ఉరే సరి అని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పేసింది.
2013, ఫిబ్రవరి 21న జరిగిన బాంబు ప్రేలుళ్ళలో 18 మంది చనిపోగా, 131 మంది గాయపడ్డారు. ఆ కేసు దర్యాప్తు జరిపిన ఎన్ఐఏ ఆరుగురు దోషులలో జియా ఉర్ రహమాన్ అలియాస్ వఘాస్ అలియాస్ నబీల్ అహ్మద్, అసదుల్లా అక్తర్ అలియాస్ హద్ది, మహ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హాసన్ అలియాస్ మోను, అజాజ్ షేక్ అలియాస్ సమర్ అర్మాన్ తుండే అలియాస్ సాగర్ అలియాస్ ఐజాజ్ సయ్యద్ షేక్, ఐదుగురిని పట్టుకోగలిగింది. ఈ కేసులో సూత్రధారిగా రియాజ్ భత్కల్ మాత్రం తప్పించుకు పారిపోగా నేటికీ అతనిని పట్టుకోలేకపోయారు.
పట్టుబడిన ఈ ఐదుగురు దోషులకు ఎన్ఐఏ కోర్టు 2016, డిసెంబర్ 13న ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దోషులు దానిని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయగా, 9 ఏళ్ళు విచారణ జరిపి ఉరిశిక్షని సమర్ధిస్తూ వారి పిటిషన్లను కొట్టివేసింది. కానీ ఇక్కడితో వారి కధ ముగిసిపోదు.
వారు హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాలు చేసి మరికొన్ని సంవత్సరాలు బ్రతికేయవచ్చు. సుప్రీంకోర్టు కూడా ఉరి శిక్ష ఖరారు చేస్తే తత రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ తతంగం అంతా పూర్తయ్యేందుకు మరో 5-6 ఏళ్ళు సమయం పట్టినా ఆశ్చర్యం లేదు. కనుక హైకోర్టు తీర్పుతో వారి కధ ముగిసిపోయిందని అనుకోలేము.