రామేశ్వరంలో పంబన్ రైల్వే బ్రిడ్జి ప్రారంభోత్సవం

దేశంలో సముద్రంపై నిర్మించిన రైల్వే బ్రిడ్జి ఒక్క రామేశ్వరంలోనే ఉంది. అయితే బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఆ వంతెన తుప్పు పట్టి పోయి తరచూ మరమత్తులకు గురవుతుండటంతో, దానికి సమీపంలోనే రైల్వేశాఖ మరో వంతెన పంబన్ రైల్వే బ్రిడ్జి నిర్మించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆ రైల్వే వంతెనని నేడు ప్రధాని మోడీ ప్రారంభోత్సవం చేశారు.

పాత బ్రిడ్జి సముద్రానికి అడ్డంగా నిర్మించినందున షిప్పుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు మద్యలో ఒక చోట వంతెన రెండు భాగాలుగా పైకి లేపేవారు. రైల్వే కార్మికులు ఇరు వైపులా ఉన్న చక్రాలను తిప్పుతూ వంతెన భాగాలను పైకి లేపేవారు. కానీ పంబన్ రైల్వే బ్రిడ్జిలో లిఫ్ట్ మాదిరిగా వంతెనలో ఓ భాగం మోటర్ల సాయంతో పైకి లేచేలా నిర్మించారు. కనుక బటన్ నొక్కితే వంతెనలో ఓ భాగం పైకి లేస్తుంది. దిగుతుంది.

అత్యాధునిక టెక్నాలజీతో పంబన్ రైల్వే బ్రిడ్జిని నిర్మించినందున ఇప్పుడు దానిపై నుంచి రైలు మరింత వేగంగా దూసుకుపోగలదు. రూ.550 కోట్లు వ్యయంతో నిర్మించిన ఈ వంతెన పొడవు 2.08 కిమీ. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో ఇప్పుడు మండపం రైల్వే స్టేషన్‌ నుంచి రామేశ్వరం స్టేషన్‌కు కేవలం 15-20 నిమిషాల్లోనే రైలు చేరుకోగలదు.