ఫ్యూచర్ సిటీకి హెచ్‌సీయూ.. కంచలో ఇకో పార్క్?

హెచ్‌సీయూ భూవివాదంలో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతుండటంతో సిఎం రేవంత్ రెడ్డి ముగ్గురు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 

బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే 600 ఎకరాలలో ఇకో పార్క్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ ప్రకటించారు.       కేటీఆర్‌ చేసిన ఈ ప్రకటనతో ప్రభుత్వం కూడా ఆ దిశలో ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భూవివాదం పరిష్కరించడానికే మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేసిన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెపుతున్నప్పటికీ, ఇప్పుడు మరో రెండు కొత్త ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

1. హెచ్‌సీయూని అక్కడి నుంచి ఫ్యూచర్ సిటీకి తరలించి అక్కడ అత్యాధునిక సదుపాయాలతో భవిష్యత్‌ అవసరాలకు తగిన విదంగా నిర్మించడం. 

2. హెచ్‌సీయూ ఉన్న 10-15 ఏకరాలతో పాటు చుట్టూ ఉన్న 2000 ఎకరాలలో మరిన్ని చెట్లు నాటించి, ప్రపంచంలోనే అతిపెద్ద ఇకో పార్కుగా మార్చి దానిలో అన్ని రకాల జంతువులకు ఆశ్రయం కల్పించి, డే-నైట్ సఫారీలు వగైరా నిర్వహించడం. 

మంత్రుల సబ్ కమిటీ ఈ రెండు ప్రతిపాదనలపై అధ్యయనం చేసి, సంబంధిత వర్గాలు, అధికారులు, పర్యావరణ, న్యాయ నిపుణులతో చర్చించి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ వార్తలను ఇంకా ధృవీకరించ వలసి ఉంది.