వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీం ఆదేశం

తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు గట్టు వామనరావు, నాగమణి దంపతుల హత్య కేసుకి సంబందించి అన్ని రికార్డులు సీల్డ్ కవర్‌లో మూడు వారాలలోగా సమర్పించాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వారిరువురూ 2021, ఫిబ్రవరి 17వ తేదీన తమ కారులో కోర్టుకు వెళ్ళి తిరిగి వస్తుండగా మంధన్-పెద్దపల్లి మద్య కొందరు దుండగులు వారి కారుని అడ్డుకొని ఇద్దరినీ బయటకు లాగి అందరూ చూస్తుండగానే అతిదారుణంగా కత్తులతో నరికి చంపారు.

ఈ కేసులో పోలీసులు కొందరిని అరెస్ట్‌ చేసినప్పటికీ ఆ తర్వాత అందరూ బెయిల్‌పై బయటకు వచ్చేశారు. అప్పటి నుంచి ఈ కేసులో పురోగతి లేకపోవడంతో గట్టు వామనరావు తండ్రి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసి దీనిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరారు. ఈరోజు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ కేసుకు సంబందించి అన్ని రికార్డులు సమర్పించాలని, వాటిని పరిశీలించిన తర్వాత సీబీఐ విచారణ అవసరమా కాదా? అని చెప్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

ఈ కేసు తదుపరి విచారణని నాలుగు వారాలు వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసుని సీబీఐకి అప్పగించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు తెలియజేసింది. కనుక సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది.