మేడిగడ్డ బ్యారేజ్‌: క్రిమినల్ కేసులు తప్పవట!

మేడిగడ్డ బ్యారేజ్‌లో మూడు పియర్స్ క్రుంగిపోవడం, అన్నారం సుందిళ్ళ బ్యారేజీల గోడలు దెబ్బ తినడంపై లోతుగా విచారణ జరిపిన తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సమర్పించిన నివేదిక నీటిపారుదల శాఖకు చేరింది. దానిలో సీనియర్ ఇంజనీర్లు, డీఈఈలు, ఏఈఈలతో సహా 30 మంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంది. వారిలో 17 మంది సీనియర్లపై క్రిమినల్ కేసులు, మిగిలిన వారిపై శాఖపరమైన చర్యలు చేపట్టాలని సూచించింది. 

మేడిగడ్డ బ్యారేజ్‌ డిజైనింగ్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాలలో పనిచేసిన వారందరూ తమ తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్లనే మేడిగడ్డ బ్యారేజ్‌ క్రుంగుబాటుకి కారణమని నివేదికలో పేర్కొంది. వివిద కారణాలతో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి నష్టం కలిగించినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం నివేదికలో సిఫార్సు చేసింది. 

కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీలు: నల్లా వేంకటేశ్వర రావు, మురళీధర్,  మాజీ ఎస్ఈ: రమణారెడ్డి, ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్: తిరుపతి రావు, చీఫ్ ఇంజనీర్: సుధాకర్ రెడ్డి తదితరులతో సహా మొత్తం 30 మందిపై చర్యలు తీసుకోవాలని నివేదికలో సిఫార్సు చేసిన్నట్లు తెలుస్తోంది. 

మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మించిన తర్వాత ఎటువంటి లోపాలున్నా గడువులోగా గుర్తించి సరిచేయాల్సిన నిర్మాణ సంస్థ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, బ్యారేజీలో లోపాల గురించి ఇంజనీర్లు వ్రాసిన లేఖలను పట్టించుకోలేదని కనుక దానిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ రిపోర్టులో సిఫార్సు చేసింది. 

ఒకేసారి ఇంతమంది ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంటే నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టులో జరుగుతున్న పనులన్నీ స్తంభించిపోయే ప్రమాదం ఉంటుంది. ఇటీవల వీరిలో 9 మందికి పదోన్నతులు కల్పించాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. విజిలెన్స్ తాజా నివేదికతో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలా లేదా ఆ నివేదికని పట్టించుకోకుండా యధాప్రకారం పదోన్నతులు కల్పించాలా?అని సంధిగ్దంలో పడింది ప్రభుత్వం.