తెలంగాణ రాష్ట్రంలో చాలా చురుకుగా పనిచేసే ఐఏఎస్ అధికారులలో స్మితా సభర్వాల్ కూడా ఒకరు. ప్రస్తుతం ఆమె పర్యాటకశాఖ కార్యదర్శిగా చేస్తున్నారు. గతంలో అంటే 2016 నుంచి 2024 వరకు ఆమె సిఎంవో అదనపు కార్యదర్శిగా ఉన్నప్పుడు తన ప్రైవేట్ కారు (నంబర్: టిఎస్08 ఈసీ6345) అద్దె చెల్లింపుకు నెలకు రూ.63,000 చొప్పున ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి 90 నెలలకు రూ.61 లక్షలు తీసుకున్నారని తాజా ఆడిట్లో బయటపడింది.
సీఎంవో కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వమే ఆమెకు వాహనం సమకూరుస్తుంది. కానీ ఆమె పవన్ కుమార్ అనే వ్యక్తి పేరిట రిజిస్టర్ అయ్యున్న ఓ ప్రైవేట్ వాహనం వాడుతున్నట్లు చూపిస్తూ నెలనెలా అద్దె బిల్లులని పంపిస్తుంటే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అధికారులు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా చెల్లిస్తుండేవారని ఆడిట్లో బయటపడిందని వైస్ చాన్సిలర్ ఆచార్య అల్దాస్ జానయ్య చెప్పారు.
కనుక దీని గురించి సమగ్ర నివేదికని ప్రభుత్వానికి సమర్పించి, ప్రభుత్వం సూచన మేరకు తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈలోగా ఆమె వివరణ కోరుతూ నోటీస్ పంపిస్తామని వైస్ చాన్సిలర్ ఆచార్య అల్దాస్ జానయ్య చెప్పారు.