మేడిగడ్డ బ్యారేజ్ క్రుంగిపోవడానికి మాజీ సిఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులే బాధ్యులని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలైన ప్రైవేట్ పిటిషన్ని కొట్టివేయడంతో, పిటిషనర్ నాగవెల్లి రాజలింగమూర్తి జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు.
రివిజన్ పిటిషన్ విచారణ చేపట్టాలనే జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో ఈ కేసు నడుస్తున్న సమయంలోనే పిటిషనర్ నాగవెల్లి రాజలింగమూర్తి ఇటీవల హత్య చేయబడ్డారు.
పిటిషనర్ చనిపోయినందున ఈ కేసుని కొట్టివేయాలని కేసీఆర్, హరీష్ రావుల తరపు న్యాయవాది అభ్యర్ధనని హైకోర్టు తిరస్కరించింది. అలాగే ఈ కేసులో మెజిస్ట్రేట్ ఉత్తర్వులపై రివిజన్ చేపట్టే అధికారం జిల్లా కోర్టుకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
కనుక ఈ పిటిషన్ విచారణకు అర్హమైనదా కాదా?అనే విషయం జిల్లా కోర్టు నిర్ణయిస్తుందని, కనుక అక్కడికే వెళ్ళి తేల్చుకోవాలని హైకోర్టు కేసీఆర్, హరీష్ రావులకు సూచించింది.
ఈ కేసుని జిల్లా కోర్టు విచారణకు అర్హమైనదని భావించి విచారణ చేపడితే కేసీఆర్, హరీష్ రావు ఇద్దరూ తమ న్యాయపోరాటం కొనసాగించాల్సి ఉంటుంది.