తిరుమలకు ధీటుగా కేసీఆర్ యాదగిరిగుట్టని యాదాద్రిగా అద్భుతంగా తీర్చి దిద్దారు. ఇటీవలే ఆలయ గోపురానికి బంగారు తాపటం కూడా పూర్తయింది. కనుక మరింత సమర్ధంగా ఆలయ నిర్వహణ చేసేందుకు, యాదగిరి గుట్ట పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు, నానాటికీ పెరుగుతున్న భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు తిరుమల తరహాలో యాదగిరి గుట్టకు కూడా ఓ బోర్డు అవసరమని సిఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పారు.
చెప్పిన్నట్లుగానే శాసనసభలో 18 మంది సభ్యులతో పాలకమండలి (బోర్డు) ఏర్పాటుకి ఆమోదముద్ర వేయించారు. త్వరలోనే దీనికి సంబందించి విధివిధానాలు రూపొందించి బోర్డు ఏర్పాటు చేస్తారు.
అయితే బోర్డు ఏర్పాటుతో దానిలో పదవుల కోసం పోటీ మొదలవుతుంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా పదవులు లభించక అసంతృప్తిగా ఉన్నవారి నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి ఉంటుంది. తిరుమల బోర్డులో ఏవిదంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు సభ్యులుగా అవకాశం కల్పిస్తున్నారో అదేవిదంగా యాదగిరిగుట్ట బోర్డులో కూడా కల్పించాలనుకుంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఒత్తిడి తప్పదు.