తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మళ్ళీ కదలిక వచ్చింది. గతేడాది మార్చి 10న పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. ఈ విషయం తెలియగానే ప్రధాన నిందితులుగా భావించబడుతున్న స్పెషల్ ఇంటలిజన్స్ బ్రాంచ్ (సిఐబి) మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇద్దరూ అమెరికా పారిపోయారు.
అప్పటి నుంచి అరెస్ట్ భయంతో హైదరాబాద్ తిరిగి రాకుండా అక్కడే ఉండి పోయారు. ప్రభాకర్ రావు మరో అడుగు ముందుకు వేసి తనకు అమెరికాలో రాజకీయ శరణార్ధిగా ఆశ్రయం కల్పించాలని అమెరికా ప్రభుత్వాన్ని అభ్యర్ధిస్తూ దరఖాస్తు చేసుకున్నారు.
అప్పటి నుంచి వారిని తిరిగి రప్పించేందుకు తెలంగాణ సీఐడీ పోలీసులు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించకపోవడంతో కోర్టు అనుమతి తీసుకొని వారిరువురిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాల్సిందిగా సీబీఐకి లేఖ వ్రాసింది.
తెలంగాణ సీఐడీ అభ్యర్ధన మేరకు సీబీఐ వారిరువురిని అరెస్ట్ చేసి వెనక్కు రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి, ఈ విషయం లేఖ ద్వారా తెలియబరిచింది.
సీబీఐ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసినందున అమెరికా పోలీసులు వారిరువురినీ అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తిప్పి పంపించాలి.
ఈ విషయం వారికి కూడా బాగా తెలుసు కనుక మళ్ళీ అక్కడి నుంచి వేరే దేశానికి పారిపోయినా ఆశ్చర్యం లేదు. వారిద్దరినీ హైదరాబాద్ తిరిగి రప్పిస్తే తప్ప ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముందుకు సాగే అవకాశం తక్కువ.