తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, శాసనసభలో బిఆర్ఎస్ పార్టీ పక్ష నాయకుడు కేసీఆర్ ప్రభుత్వం మారినప్పటి నుంచి శాసనసభకు రెండుసార్లు మాత్రమే వచ్చారు కానీ ఈ 15 నెలల్లో రూ.57,84,124 జీతాభత్యాలుగా ప్రభుత్వం నుంచి తీసుకున్నారని సిఎం రేవంత్ రెడ్డి ఈరోజు శాసనసభలో వెల్లడించారు.
శాసనసభ్యులు కూడా ప్రభుత్వం నుంచి జీతాభత్యాలు తీసుకుంటున్నందున వారు కూడా ఉద్యోగులే అని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని సిఎం రేవంత్ రెడ్డి సభకు గుర్తుచేశారు. శాసనసభ సమావేశాలకు రాకుండా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూర్చుంటే ప్రభుత్వం నెలనెలా లక్షల రూపాయలు జీత భత్యాలు చెల్లించాల్సిన అవసరం ఉందా?
కోవిడ్ సమయంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం పద్దతిలో పనిచేసుకునే వెసులుబాటు ఉండేది. రాజకీయాలలో కూడా వర్క్ ఫ్రమ్ హోం పద్దతి ఏమైనా ఉందా?ఆయన ఫామ్‌హౌస్‌లో కూర్చొని అలాగే పనిచేస్తున్నారా?” అని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఇకనైనా కేసీఆర్ శాసనసభ సమావేశాలకు హాజరయ్యి తన నియోజకవర్గం ప్రజల తరపున మాట్లాడాలని సిఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.