తెలంగాణ బీజేపి ఎంపీ రఘునందన్ రావు శుక్రవారం కుటుంభ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడుతూ, “శ్రీవారి బ్రేక్ దర్శనాలు, వసతి సౌకర్యాల కోసం తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇస్తున్న సిఫార్సు లేఖలను టీడీపీ పరిగణనలోకి తీసుకోవాలని మా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకి లేఖ వ్రాశారు.
అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వం వెంటనే టీటీడీకి మార్గదర్శకాలు జారీ చేసి, ఫిబ్రవరి 1 నుంచి అమలుచేయాలని ఆదేశించింది. అందుకు టీటీడీ కూడా అంగీకరించింది.
కానీ నేటికీ టీటీడీ అధికారులు తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇస్తున్న సిఫార్సు లేఖలను పట్టించుకోవడం లేదు. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఆదేశించినా టీటీడీ అధికారులు ఖాతారు చేయరా?
ఇకనైనా టీటీడీ తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇస్తున్న సిఫార్సు లేఖలను గౌరవించి వారు సూచించిన వారికి బ్రేక్ దర్శనాలు, వసతి సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఒకవేళ టీటీడీ అధికారులు ఇంకా అలసత్వం ప్రదర్శిస్తే ఈసారి తెలంగాణ ప్రజా ప్రతినిధులందరినీ వెంట పెట్టుకొని వచ్చి టీటీడీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తాను,” అని రఘునందన్ రావు హెచ్చరించారు. దీనిపై టీటీడీ అధికారులు ఇంకా స్పందించవలసి ఉంది.