శాసనసభలో కాంగ్రెస్‌-బిఆర్ఎస్ బిగ్ ఫైట్!

ఈరోజు శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుండగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ని ఉద్దేశించి, “ఈ సభ అందరిదీ. మా అందరి తరపున పెద్ద మనిషిగా నువ్వు అక్కడ స్పీకర్‌ కుర్చీలో కూర్చున్నావు. అంత మాత్రాన్న ఈ సభ మీసొంతం కాదు,” అంటూ ఆక్షేపించారు. 

స్పీకర్‌ని ఉద్దేశించి జగదీష్ రెడ్డి అమర్యాదగా మాట్లాడినందుకు కాంగ్రెస్‌ సభ్యులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందు ఆయన స్పీకర్‌కి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ తానేమీ అమర్యాదగా మాట్లాడలేదంటూ జగదీష్ రెడ్డి వాదించడంతో, ఆయనని సభ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబుతో సహా కాంగ్రెస్‌ సభ్యులు డిమాండ్ చేశారు.  

హరీష్ రావు మాట్లాడుతూ, “జగదీష్ రెడ్డి గారు స్పీకర్‌ను అవమానించలేదు. ఈ సభ మీ ఒక్కరిది కాదు.. అందరిదీ అన్నారు. నిజమే కదా? శాసనసభ కాంగ్రెస్‌ పార్టీకో లేదా కాంగ్రెస్‌ ప్రభుత్వానికో సొంతం కాదు కదా? కానీ ఆయన మాటలను వక్రీకరించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్నారు,” అని వాదించారు. 

ఇరు పక్షాలు వెనక్కు తగ్గకపోవడంతో స్పీకర్‌ సభని కొంతసేపు వాయిదా వేశారు.