పంట రుణాలు మాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేసిందంటూ బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈరోజు శాసనమండలిలో ధీటుగా బదులిచ్చారు.
“బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంట రుణాలు మాఫీ చేస్తామంటూ విడతలవారీగా నిధులు విడుదల చేసింది. ఒకేసారి విడుదల చేయకపోవడం వలన ఆ సొమ్మంతా వడ్డీలకే సరిపోయింది. కనుక బిఆర్ఎస్ పార్టీ చేసింది రుణమాఫీ కాదు వడ్డీ మాఫీ. అది కూడా పూర్తిగా చేయకుండా అలాగే వదిలేసి దిగిపోయింది.
పంట రుణాలు మాఫీ చేయలేమని బిఆర్ఎస్ పార్టీకి అర్దమైంది. అందుకే 2023 ఎన్నికల మ్యానిఫెస్టోలో పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇవ్వలేదు. అవునా కాదా? బిఆర్ఎస్ పార్టీ నేతలే చెప్పాలి.
మీకు చాతకాక వదిలేస్తే, మా కాంగ్రెస్ పార్టీకి రైతులకు అండగా నిలబడాలని అనుకుంది కనుకనే మా మ్యానిఫెస్టోలో ఈ అంశం పెట్టాము. మీరు పదేళ్ళలో పూర్తి చేయలేకపోయిన రుణమాఫీని మా పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అమలుచేసింది.
పంట రుణాల మాఫీ కోసం మా ప్రభుత్వం రూ.21,000 కేటాయించి, ఒకేసారి రూ.2 లక్షల వరకు నిధులు విడుదల చేసి రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసింది. మా పార్టీ, ప్రభుత్వం నిబద్దతకు ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది?
మీరు చేయలేకపోయిన పనిని మేము చేస్తుంటే మమ్మల్ని అభినందించాల్సింది పోయి విమర్శిస్తున్నారు. ప్రతిపక్షమంటే విమర్శించడమే కాదు నిర్మాణాత్మకమైన సలహాలు కూడా ఇవ్వాలి,” అన్నారు జీవన్ రెడ్డి.