గమనిక: నేను పార్టీ మారడం లేదు: పాడి కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ మారబోతున్నారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

అవి ఆయన దృష్టికి రావడంతో వెంటనే స్పందిస్తూ ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్న నా రాజకీయ ప్రత్యర్ధులే ఈవిదంగా నా గురించి దుష్ప్రచారం చేస్తున్నారని నాకు తెలుసు. 

కానీ నేను నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను. కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తాను. బిఆర్ఎస్ పార్టీయే నా కుటుంబం. కేసీఆర్‌ నా తండ్రివంటివారు. ఎట్టి పరిస్థితులలో పార్టీ మారే ప్రసక్తే లేదు,” అని అన్నారు. 

మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డికి ఎన్నికలలో టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని కేసీఆర్‌ ప్రయత్నించారు. కానీ అప్పుడు గవర్నరుగా వ్యవహరించిన తమిళసై సౌందర్ రాజన్‌ కేసీఆర్‌ సిఫార్సు లేఖని తిరస్కరించారు. 

దాంతో కేసీఆర్‌ ఆయనకు 2023 ఎన్నికలలో హుజూరాబాద్ టికెట్ ఇవ్వగా ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు. కానీ బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోవడంతో ఆయన ఎమ్మెల్యే పదవితోనే సర్దుకుపోక తప్పడం లేదు. కనుక ఆయనకు కాంగ్రెస్ పార్టీ మంత్రి ఆఫర్ చేసి పార్టీలోకి ఆహ్వానిస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ వాటిని పాడి కౌశిక్ రెడ్డి ఖండించారు.