బేగంపేట విమానాశ్రయం కింద సొరంగ మార్గం!

బేగంపేట విమానాశ్రయం కింద సొరంగ మార్గం లేదు. కానీ 600 మీటర్ల పొడవైన సొరంగ మార్గం నిర్మించేందుకు ఎయిర్ పోర్టు ఆధారిటీ అనుమతి మంజూరు చేసింది. ప్యారడైజ్ సర్కిల్ నుంచి తాడ్ బండ్, బోయినపల్లి మీదుగా డైరీఫారం వరకు రూ.630 కోట్లు వ్యయంతో 5.4 కిమీ పొడవునా ఎలివేటడ్ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించాలని హెచ్ఎండీఏ భావించింది.

దీనిలో 3.05 కిమీ పొడవునా ఎలివేటడ్ ఎక్స్‌ప్రెస్‌ కారిడార్, 600 మీటర్ల సొరంగ మార్గం ఉంటుంది.  దీనిలో భాగంగా బోయినపల్లి జంక్షన్ వద్ద రెండు వైపులా 248-475 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పుతో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేస్తారు.  భూసేకరణ ఖర్చులు కూడా కలుపుకుంటే రూ.5,550 కోట్లు అవుతుందని అంచనా వేశారు. 

కానీ ఈ మార్గంలో బేగంపేట విమానాశ్రయం ఉండటంతో దాని మీదుగా ఎలివేటడ్ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించడం సాధ్యం కాదు కనుక కింద నుంచి సుమారు 600 మీటర్లు పొడవుండే సొరంగ మార్గం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

ఈ ప్రతిపాదనకు ఎయిర్ పోర్టు ఆధారిటీ అనుమతి మంజూరు చేసినందున త్వరలో భూసేకరణ ప్రక్రియతో పాటు సొరంగ మార్గం నిర్మించేందుకు టెండర్లు పిలిచేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. 

ఈ ఎక్స్‌ప్రెస్‌ వే, సొరంగ మార్గం పనులు పూర్తయ్యేందుకు సుమారు 3-4 సంవత్సరాలు పట్టవచ్చు. ఇది అందుబాటులోకి వస్తే డెయిరీ ఫామ్‌ నుంచి ఎటువంటి ట్రాఫిక్ బాధలు, సిగ్నల్ సమస్యలు లేకుండా వాహనదారులు చాలా సులువుగా, త్వరగా సికింద్రాబాద్‌ చేరుకోవచ్చు.