అవును! పాకిస్తాన్‌లో ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ చేయబడింది! ఈ హైజాక్‌కి పాల్పడింది తామేనని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.
బలూచిస్థాన్‌లో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు మార్గంలో రైల్వేట్రాక్ పేల్చివేసి తుపాకులతో కాల్పులు జరుపుతూ రైలుని హైజాక్ చేశారని పాక్ మీడియా తెలియజేసింది. రైలులో ప్రయాణికులను బందించడంతో, పాక్ ఆర్మీ వారిని విడిపించేందుకు ఆపరేషన్ మొదలుపెట్టింది. ఎదురు కాల్పులలో ఏడుగురు ఆర్మీ జవాన్లు మరణించిన్నట్లు తెలుస్తోంది.
కశ్మీరులో ఉగ్రవాదులను, వేర్పాటువాదులను ప్రోత్సహించే పాకిస్థాన్ కూడా బలూచిస్థాన్ వేర్పాటువాదులతో దశాబ్ధాలుగా బాధపడుతూనే ఉంది. పాకిస్థాన్ నుంచి బలూచిస్తాన్ విడిపోయి స్వతంత్రదేశంగా ఆవిర్భవించేందుకు దాదాపు 25 ఏళ్ళుగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ గెరిల్లా యుద్ధాలు చేస్తూనే ఉంది.
ఆ కారణంగా పాకిస్థాన్ ప్రభుత్వం కూడా వారిని కర్కశంగా అణచివేస్తూనే ఉంది. ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో బలూచిస్తాన్ సరిహద్దు కలిగి ఉంది. కనుక బలూచిస్తాన్ మీదుగా ఆ దేశాలను కలుపుతూ చైనా సిపెక్ పేరుతో ఓ రోడ్ నిర్మిస్తోంది. తమ ప్రాంతంలో సహజవనరులు దోచుకోవడానికి చైనా, పాకిస్థాన్ కుట్ర చేస్తున్నాయని నిరసిస్తూ బలోచ్ లిబరేషన్ ఆర్మీ తామ పోరాటాలు మరింత ఉదృతం చేసింది. వారి పోరాటాలకు పరాకాష్టే ఈ హైజాక్ అని చెప్పుకోవచ్చు.