ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎమ్మెల్యేల కోటాలో చెరో 5 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, ఒక్కో సీటుకి ఓకే అభ్యర్ధి చొప్పున నామినేషన్స్ వేసినందున ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ వేశారు. కాంగ్రెస్ పార్టీ ఓ సీటుని సీపీఐకి కేటాయించడంతో ఆ పార్టీ అభ్యర్ధిగా నెల్లికంటి సత్యం నామినేషన్ వేశారు. బిఆర్ఎస్ పార్టీ ఇద్దరు అభ్యర్ధులను నిలబెడుతుందని ఊహాగానాలు వినిపించినప్పటికీ దాసోజు శ్రవణ్ కుమార్ ఒక్కరినే అభ్యర్ధిగా ప్రకటించడంతో ఆయన కూడా చివరి రోజైన సోమవారం నామినేషన్స్ వేశారు.
ఏపీలో ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం 5 ఎమ్మెల్సీ సీట్లు టీడీపీ-జనసేన-బీజేపి కూటమికే లభిస్తాయి. కనుక టీడీపీ ముగ్గురుని, జనసేన, బీజేపి చెరో సీటుకి అభ్యర్ధులను ఖరారు చేశాయి. వారు కూడా నిన్న నామినేషన్ వేశారు. రెండు రాష్ట్రాలలో ఈ 10 మంది ఎమ్మెల్సీలుగా ఎన్నిక లాంఛనప్రాయమే.
నిబంధనల ప్రకారం ఈ నెల 13న నామినేషన్స్ ఉపసంహరణ తర్వాత మిగిలిన అభ్యర్ధులను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.