విజయశాంతి, అద్దంకిలకు ఎమ్మెల్సీ టికెట్స్ ఖరారు

ఈ నెల 20న ఎమ్మెల్యేల కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. రేపు (సోమవారం)తో నామినేషన్స్ గడువు ముగియబోతోంది. కనుక కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను నేడు ప్రకటించింది. సీనియర్ నాయకుడు, సిఎం రేవంత్ రెడ్డికి నమ్మిన బంటు అద్దంకి దయాకర్, ప్రముఖ సినీ నటి, సీనియర్ నాయకురాలు విజయశాంతి, సీనియర్ నాయకుడు కేతావత్ శంకర్ నాయక్‌ ముగ్గురి పేర్లు ఖరారు చేసి ప్రకటించింది. 

కాంగ్రెస్‌కున్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం మరో ఎమ్మెల్సీని నిలబెట్టి గెలిపించుకోవచ్చు. కానీ ఆ సీటుని మిత్రపక్షంగా ఉన్న సిపిఐ పార్టీకి కేటాయించినట్లు ప్రకటించింది. కనుక సీపీఐ పార్టీ తమ ఎమ్మెల్సీ అభ్యర్ధిని ఖరారు చేసుకొని ప్రకటించాల్సి ఉంది. 

బిఆర్ఎస్ పార్టీ కూడా ఓ అభ్యర్ధిని నిలబెట్టి గెలిపించుకోగలదు. కానీ ఇంతవరకు అభ్యర్ధిని ప్రకటించలేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి వారు దానిని ఉల్లంఘిస్తే వారిపై అనర్హత వేటుకి మార్గం సుగమం అవుతుంది కనుక ఇద్దరు అభ్యర్ధులను బరిలోకి దింపబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక రేపు ఉదయానికల్లా, సీపీఐ, బిఆర్ఎస్ పార్టీల అభ్యర్ధులు ఎవరో తేలిపోతుంది.