ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చనిపోయిన 8 మంది కార్మికుల మృతదేహాలు ఎక్కడెక్కడున్నాయో గుర్తించగలిగారు. కానీ వాటిపై భారీగా శిధిలాలు, కాంక్రీట్, బురదనీరు పేరుకుపోవడంతో బయటకు తీయలేకపోతున్నారు.
మృతదేహాలున్న ప్రాంతంలో తీవ్ర దుర్వాసన వస్తుండటంతో వ్యర్ధాల తొలగింపు చాలా ఇబ్బందికరంగా మారింది. కనుక ఇటువంటి పనులు చేయగల రోబోలను రంగంలో దించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. కానీ మరో వారం రోజుల వరకు రోబోలు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
అంతవరకు శిధిలాలను తొలగిస్తూ వాటి కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. టన్నల్ బోరింగ్ మెషీన్‌ని గ్యాస్ కట్టర్‌తో ముక్కలు ముక్కలుగా కట్ చేసి బయటకు పంపించడంతో దాని సమీపంలో కాంక్రీట్ కింద చిక్కుకొని చనిపోయిన ఓ కార్మికుడి చెయ్యి కనపడింది. దాదాపు రెండు వారాలుగా సొరంగం నుంచి రేయింబవళ్ళు నిరంతరంగా వ్యర్ధాలు, బురదనీరు బయటకు పంపిన తర్వాత తొలిసారిగా ఓ మృతదేహం ఎక్కడ ఉందో కనిపించింది. కనుక ఈరోజు సాయంత్రంలోగా అక్కడ తవ్వకాలు జరిపి మృతదేహాన్ని బయటకు తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదం జరిగిన తర్వాత దేశంలో వివిద రంగాలకు చెందిన నిపుణులు, శాస్త్రవేత్తలు అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. పలువురు విదేశీ నిపుణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏది ఏమైనప్పటికీ సొరంగంలో చనిపోయిన వారందరి మృతదేహాలు బయటకు తీసేందుకు కననీసం మారో వారం పది రోజులు సమయం పట్టే అవకాశం ఉంది.