నా బామర్ధి ఎమ్మెల్యే ఐలయ్య .. వేస్ట్: బాలరాజు

కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో రైతులు సాగునీటి సమస్యలతో సతమతమవుతున్నారని బిఆర్ఎస్ పార్టీ నేతలు నిత్యం ఆరోపిస్తూనే ఉన్నారు. అయితే అది ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయి, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ఉంది కనుక అసూయతో విమర్శలు చేస్తోందనుకున్నా, కాంగ్రెస్‌ కార్యకర్త, ఎమ్మెల్యే సొంత బంధువు ఇవే ఆరోపణలు చేస్తే నిజమే అని నమ్మక తప్పదు కదా?  

యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరి గుట్ట మండలంలోని మూసాయిపేట గ్రామానికి చెందిన రైతు ఎమ్మా బాలరాజు తన 6 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటారు. 

శనివారం ఆయన తన పొలం వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నా మేన బావమరిధి. అయినప్పటికీ నా పొలానికి, చుట్టుపక్కల రైతుల పొలాలకు చుక్క నీరు అందడం లేదు. 

పోనీ.. బోరుబావిలో నీళ్ళు తోడి పొలాలకు నీళ్ళు పెట్టుకుందామంటే లో వోల్టేజ్ కారణంగా ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటిని మరమత్తు చేయమని విద్యుత్ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. 

పంటలకు నీళ్ళు అందక నా 6 ఎకరాల పొలం ఎండిపోయింది. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా.. నా బామర్ధి ఎమ్మెల్యే అయినా ఏం ప్రయోజనం?

ఎన్నికల సమయంలో జిల్లాకు కాళేశ్వరం నీళ్ళు తెస్తానన్న పెద్దమనిషి ఐలయ్య పత్తాలేకుండా పోయాడు. మా గోడు ఎవరికి చెప్పుకోవాలో.. ఎవరు తీరుస్తారో అర్దం కావడం లేదు,” అంటూ రైతు ఎమ్మ బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం...