నాగబాబు ఎమ్మెల్సీ!

సినీ నటుడు, మెగా బ్రదర్స్‌లో ఒకడైన నాగబాబు కూడా ఎమ్మెల్సీ కాబోతున్నారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. శుక్రవారం మద్యాహ్నం నాగబాబు అమరావతిలో రిటర్నింగ్ అధికారిని వనితా రాణికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌,  బీజేపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

ఇది ఎమ్మెల్యేల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక కనుక ఆయనకు టికెట్ ఖరారు చేయడంతోనే ఎమ్మెల్సీగా ఎన్నికయిపోయిన్నట్లే.

నాగబాబుని ఎమ్మెల్సీగా మండలిలోకి తీసుకువచ్చి, ఆ తర్వాత మంత్రివర్గంలో తీసుకురావాలని ఆయన సోదరుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కనుక రాబోయే రోజుల్లో నాగబాబు మంత్రి పదవి చేపట్టినా ఆశ్చర్యం లేదు. 

పవన్ కళ్యాణ్‌, నాగబాబు కంటే ఎంతో ప్రజాధరణ, గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాలలో ప్రవేశించారు. కానీ ముఖ్యమంత్రి కావాలనే తన కల నెరవేర్చుకోలేకపోయారు. కనీసం పార్టీని నిర్వహించలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసి మళ్ళీ సినిమాలు చేసుకుంటున్నారు.

కానీ ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్‌ జనసేనతో ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించి ఎన్ని సమస్యలు, సవాళ్ళు, అవరోధాలు, అవమానాలు ఎదురైనా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా నిబ్బరంగా ముందుకే సాగుతూ ఎన్నికలలో విజయం సాధించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవులు చేపట్టారు. ఇప్పుడు తన సోదరుడు నాగబాబుకి పదవి దక్కేలా చేశారు.