నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు. వాటిలో యాదగిరి గుట్టకు కూడా తిరుమల టీటీడీ తరహాలో పాలక మండలి ఏర్పాటు చేయాలనేది ఒకటి.
తద్వారా యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తూ, ఆలయ నిర్వహణ, నిత్యపూజలు మరింత చక్కగా నిర్వహించవచ్చని, భక్తులకు మరింత మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఇన్ని దశాబ్ధాలుగా ఆలయానికి పాలక మండలి లేకపోయినా ఈవో, ఆలయ అధికారులు, పూజారుల ఆధ్వర్యంలో అన్నీ చక్కగా నిర్వహిస్తూనే ఉన్నారు.
ఆలయ నిర్వహణ, పూజలు, భక్తులకు సేవలు, సౌకర్యాల విషయంలో కూడా పెద్దగా పిర్యాదులు లేవు. కనుక పాలక మండలి ఏర్పాటు యాదగిరి గుట్టకి అవసరమా? అనే సందేహం కలుగుతుంది.
టీటీడీ పాలక మండలిని గమనిస్తే దానిలో అధికార పార్టీ నేతలే ఎక్కువగా కనిపిస్తారు. అంటే రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకే పాలక మండలి ఏర్పాటు చేసినట్లనిపిస్తుంది. తద్వారా తిరుమల స్వామివారి ఆలయ నిర్వహణలో రాజకీయ జోక్యం పెరిగింది.
టిటిడీలో జరుగుతున్న రాజకీయాలు, దాని వలన ఎదురవుతున్న సమస్యలను చూస్తున్నప్పుడు, యాదగిరి గుట్టకు పాలక మండలి ఏర్పాటు చేయడం అవసరమా అనిపించక మానదు.