ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదం జరిగి నేటికీ 13 రోజులు. అయినా ఇంతవరకు ఈ ప్రమాదంలో చనిపోయిన 8 మంది మృతదేహాలను బయటకు తేలేకపోతున్నారు. ప్రమాదం జరిగిన చోటుకి అడ్డంగా టన్నల్ బోరింగ్ మెషీన్ చిక్కుకొని ఉండటం, సొరంగంలో వ్యర్ధాలను బయటకు తరలించే కన్వేయర్ బెల్ట్ మళ్ళీ పాడైపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి.
సొరంగంలో ప్రమాదం జరిగిన చోట శిధిలాలు తొలగించిన తర్వాత మూడదుగుల లోతున బురదలో చిక్కుకొని చనిపోయినవారి మృతదేహాలు వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో పక్క టన్నల్ బోరింగ్ మెషీన్ కింద చిక్కుకొని చనిపోయిన నలుగురి మృతదేహాలను బయటకు తీసేందుకు ఆ మెషిన్ని గ్యాస్ కటింగ్‌తో ముక్కలు ముక్కలుగా కట్ చేసి బయటకు తెస్తున్నారు.
ఈ పరిస్థితిలో సొరంగంలో వ్యర్ధాలను బయటకు తీసేందుకు రోబోలు ఉపయోగిస్తే ఎలా ఉంటుందనే కొత్త ఆలోచన చేస్తున్నారు. సొరంగంలో రోబోల వినియోగం సాధ్యపడుతుందో లేదో అధ్యయనం చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన ఎన్వీ రోబోటిక్స్ కంపెనీ ఇంజనీర్లు, ఈ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులతో కలిసి ఎస్ఎల్బీసీ సొరంగంలోకి వెళ్ళి పరిశీలించారు.
రోబోల వినియోగం సాధ్యమైతే తక్షణం రంగంలో దించాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఒకవేళ సాధ్యమనుకుంటే ఒకటి రెండు రోజులలో ఎస్ఎల్బీసీ సొరంగంలో రోబోలు పని మొదలు పెడతాయి.