ఎమ్మెల్సీ ఎన్నికలలో శ్రీపాల్ రెడ్డి, కొమరయ్య గెలుపు

ఫిబ్రవరి 27న జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలలో ఉపాధ్యాయ నియోజకవర్గాలలో శ్రీపాల్ రెడ్డి, కొమరయ్య విజయం సాధించగా, పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి ఇంకా ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 

ఉమ్మడి నల్గొండ-వరంగల్‌-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పీఆర్టీయూ అభ్యర్ధిగా పోటీ చేసిన పింగళి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

పీఆర్టీయూ టిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి తొలి ప్రాధాన్యత ఓట్లలో 6,305, రెండో ప్రాధాన్యతలో 13,969 ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికలో మొత్తం 19 మంది అభ్యర్ధులు పోటీ చేయగా మొత్తం 24,135 ఓట్లు పడ్డాయి. వాటిలో 494 ఓట్లు చెల్లలేదు.   

ఉమ్మడి కరీంనగర్‌-మెదక్- నిజామాబాద్‌-ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి బీజేపి మద్దతు ప్రకటించిన మల్క కొమరయ్య తన సమీప ప్రత్యర్ధి (టిఎస్) వంగా మహేందర్ రెడ్డిపై 5,777 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ స్థానానికి పోటీ పడిన వారిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డికి కేవలం 428 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం 25,041 ఓట్లు పోల్ అవగా వాటిలో 897 ఓట్లు చెల్లలేదు. వాటిలో కొమరయ్యకు 12,959 ఓట్లు గెలుచుకొని ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

ఉమ్మడి కరీంనగర్-నిజామాబాద్‌- ఆదిలాబాద్-మెదక్ పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఈ ఎన్నికలలో భారీ సంఖ్యలో ఓట్లు చెల్లకుండా పోవడంతో లెక్కింపు పప్రక్రియ ఆలస్యమవుతోంది.