మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాజీ సిఎం కేసీఆర్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వడం కంటే లిఫ్ట్ ఇరిగేషన్ సులువు అనుకున్నాము. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిన శ్రద్ద, దాని కోసం చేసిన చెల్లింపులలో కనీసం 20 శాతం ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ కోసం పెట్టినా సొరంగం తవ్వకం ఎప్పుడో పూర్తయ్యి ఉండేది. కానీ కేసీఆర్ దృష్టి అంతా కాళేశ్వరం ప్రాజెక్టుపైనే ఉంది తప్ప ఎస్ఎల్బీసీపై పెట్టలేదు. అందువల్లే పనులు చాలా ఆలస్యం అయ్యాయి.
కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనిపై దృష్టి పెట్టి మూడేళ్ళలో పనులు పూర్తి చేయాలని ;లక్ష్యంగా పెట్టి పనులు చేయిస్తున్నారు. ఇటువంటి ప్రాజెక్టులలో ప్రమాదాలు జరగడం సహజం. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నప్పుడు, శ్రీశైలం పవర్ హౌస్లో ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు కదా?ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు వచ్చి రాజకీయాలు చేసిన హరీష్ రావుకి ఈ విషయం తెలుసు కదా?
అసలు ఈ ప్రాజెక్టు ఎందుకు ఇంత ఆలస్యం అయ్యిందో అందరి కంటే ఆయనకే బాగా తెలుసు. ఈ ప్రాజెక్టు చేపట్టడమే తప్పని హరీష్ రావు వాదించారు. మరి అటువంటప్పుడు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దీని కోసం రూ.3,300 కోట్లు ఎందుకు ఖర్చు చేశారో హరీష్ రావు చెప్పాలి.
ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు అందరూ సంయమనం పాటించి ప్రభుత్వానికి సహకరించాలి తప్ప ఇలా రాజకీయాలు చేయడం సబబు కాదు. ఇటువంటి సమయంలో రాజకీయనాయకులు అక్కడకు వెళ్తే సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని హరీష్ రావుకి తెలియదా?” అని ప్రశ్నించారు గుత్తా సుఖేందర్ రెడ్డి.