తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ వరంగల్ జిల్లా మూమునూరు వద్ద విమానాశ్రయం త్వరలో నెరవేరబోతోంది. ఈ విమానాశ్రయం నిర్మాణం కొరకు పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించి నిర్వహిస్తున్న జీఎంఆర్ సంస్థ దానికి 150 కిమీ పరిధిలో మరో విమానాశ్రయం నిర్మించకూడదని ముందే కేంద్రంతో ఒప్పందం చేసుకుంది. కనుక పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకొని ఆ సంస్థ యాజమాన్యంతో మాట్లాడి ఒప్పించారు.
ఇప్పటికే మూమునూరులో విమానాశ్రయం నిర్మాణం కొరకు ఎయిర్ పోర్టు ఆధారిటీ వద్ద 696 ఎకరాలున్నాయి. రన్ వే, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తదితర అవసరాల కోసం మరో 253 ఎకరాలు సేకరించింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.205 కోట్లు విడుదల చేసేందుకు గతంలోనే జీవో జారీ చేసింది.
ఇప్పుడు విమానాశ్రయం నిర్మాణానికి అన్ని మార్గం సుగమం అయ్యింది కనుక వీలైనంత త్వరగా దాని నిర్మాణం కోసం సమగ్ర నివేదిక (డీపీఆర్) సిద్దం చేసి నిర్మాణ పనులు మొదలుపెట్టాలని మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్ పోర్టు ఆధారిటీ ఆఫ్ ఇండియాని ఆదేశించారు.
మరో ఆరు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించగలిగితే, 2028 నాటికి పూర్తయ్యి విమానసేవలు అందుబాటులోకి వస్తాయి.