ఇక్కడ కూడా రాజకీయాలేనా హరీష్?ఉత్తమ్ ప్రశ్న

మాజీ మంత్రి హరీష్ రావు బిఆర్ఎస్ నేతలను వెంటబెట్టుకొని ఎస్ఎల్‌బీసీ సొరంగం వద్దకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మీడియాతో మాట్లాడుతూ, “సొరంగంలో నిరంతరంగా బురద నీటిని బయటకు తోడిపోస్తూనే ఉన్నారు. అయినా చాలా వేగంగా నీరు వస్తుండటంతో సహాయ చర్యలు ఆటంకం ఏర్పడుతోంది. 

హరీష్ రావు స్వయంగా ఇక్కడి పరిస్థితిని, సహాయ చర్యలను చూశాక ఈవిదంగా విమర్శలు చేయడం సరికాదు. ఇక్కడ ఇంత మంది రేయింబవళ్ళు శ్రమిస్తుంటే బిఆర్ఎస్ పార్టీ నేతలు ఇక్కడ కూడా రాజకీయాలు చేయడానికి తరలివచ్చారు. 

మమ్మల్ని నిందిస్తున్న హరీష్ రావుకు ఆనాడు శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగి ఆరుగురు ఉద్యోగులు చనిపోతే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ వెళ్ళి పరామర్శించారా?పాలమూరు పంప్ హౌస్ వరద నీటిలో మునిగిపోయినప్పుడు ఆరుగురు ఉద్యోగులు చనిపోతే వచ్చారా?

 కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది చనిపోతే కేసీఆర్‌ వెళ్ళి పరామర్శించారా? కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ సమీపంలోనే మూసాయిపేటలో రైలు ప్రమాదం జరిగి చిన్నారులు చనిపోతే కేసీఆర్‌ వెళ్ళి పరామర్శించారా? మేడిగడ్డ బ్యారేజ్‌ క్రుంగిపోయినప్పుడు మేము చూసేందుకు వెళ్తే మమ్మల్ని పోలీసులతో అడ్డుకోలేదా?

ఆయన రాకపోతే బిఆర్ఎస్ పార్టీలో ఎవరికీ నొరెత్తి అడిగే ధైర్యం లేదు. కానీ మా ముఖ్యమంత్రిపై బురద జల్లుతున్నారు. 

హరీష్ రావుకి అంత జ్ఞానం, అనుభవమే ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన మూడేళ్ళకే మేడిగడ్డ బ్యారేజ్‌ ఎందుకు క్రుంగిపోయింది. మిగిలిన బ్యారేజీలు ఎందుకు దెబ్బ తిన్నాయి? బిఆర్ఎస్ పార్టీ 9 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎస్ఎల్‌బీసీ సొరంగం పనులు చేసి ఉండి ఉంటే నేడు ఈ ప్రమాదం జరిగి ఉండేదే కాదు. 

ఎస్ఎల్‌బీసీ సొరంగంలో గ్రావిటీ ద్వారా నల్గొండ జిల్లాకు నీళ్ళు తీసుకురావచ్చని మేము చెపుతూనే ఉన్నాము. కానీ కమీషన్ల కోసం కక్కుర్తి పడి దీనిని పట్టించుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టారు. అది కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే క్రుంగిపోయింది కదా?

మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్ఎల్‌బీసీ సొరంగంలో నీటిని అరికట్టడానికి గట్టి ప్రయత్నాలు చేశాము. మాకు చిత్తశుద్ధి ఉంది కనుకనే ఎస్ఎల్‌బీసీ సొరంగం తవ్వకం పనులు మళ్ళీ మొదలుపెట్టాము. 

ఎస్ఎల్‌బీసీ సొరంగం సహాయ చర్యలు మరో రెండు రోజులలో పూర్తవుతాయి. లోపల చిక్కుకున్నవారిని ప్రాణాలతో కాపాడేందుకు అందరం రేయింబవళ్ళు కృషి చేస్తూనే ఉన్నాము,” అని ఉత్తమ్ కుమార్‌ రెడ్డి అన్నారు.