ఆరు రోజులలో తట్టెడు మట్టి బయటకు తీయలేదు: హరీష్

మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితర బిఆర్ఎస్ నేతలు గురువారం ఎస్ఎల్‌బీసీ సొరంగం వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించాలనుకున్నారు. కానీ పోలీసులు వారిని అడ్డగించడంతో అక్కడే కాసేపు బైటాయించి నిరసనలు తెలిపారు.

అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, “ఎస్ఎల్‌బీసీ ప్రమాదం జరిగి ఆరు రోజులవుతోంది. లోపల 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. కానీ ఇంతవరకు వారిని కాపాడి బయటకు తేలేకపోయారు. 

మంత్రులు హెలికాఫ్టర్లలో వచ్చిపోతున్నారు ఇదేదో పిక్నిక్ స్పాట్ అన్నట్లు. కానీ ఆరు రోజులుగా సొరంగంలో నుంచి తట్టెడు మట్టి బయటకు తీయలేదు. కనీసం పంపులు పెట్టి లోపల పేరుకుపోతున్న బురద నీటిని తొలగించలేదు. ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఏదీ నిర్మించడం చాతకాదు. ఏదైనా అందుకే ఇలా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిలో ప్రాణాలు పోతూనే ఉన్నాయి. 

అయినా ఈ ముఖ్యమంత్రికి ఏమీ పట్టన్నట్లు ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాడు. ఇక్కడ ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ఒక్కసారి కూడా రాలేదు. ఆయన రాకపోతే పోయే, మేము వస్తే మమ్మల్నీ రానీయకుండా పోలీసులతో అడ్డుకున్నారు. ఇప్పటికైనా సహాయ చర్యలు వేగవంతం చేసి లోపల చిక్కుకున్న కార్మికులను కాపాడాలి,” అని అన్నారు.