నేడు ప్రధాని మోడీ-సిఎం రేవంత్ భేటీ

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి బుధవారం ప్రధాని మోడీని కలవనున్నారు. ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ ఖారారు అయిన్నట్లు ప్రధాని కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందడంతో సిఎం రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. గత ఏడాది జూలైలో ప్రధాని మోడీని సిఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఆ తర్వాత చాలాసార్లు ఢిల్లీ వెళ్ళివచ్చినప్పటికీ ప్రధాని మోడీని కలవలేదు. 

గత శుక్రవారం ఎస్ఎల్‌బీసీ ప్రమాదం జరిగిన సంగతి తెలుసుకొని ప్రధాని మోడీ స్వయంగా ఫోన్లో సిఎం రేవంత్ రెడ్డితో మాట్లాడారు. అప్పటి నుంచి సహాయ చర్యలు చేపట్టినా సొరంగంలో చిక్కుకున్నవారిని కాపాడి బయటకు తేలేకపోయారు. సిఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 10.3 గంటలకు ప్రధాని మోడీని కలిసినప్పుడు ఈ విషయంతో పాటు రాష్ట్రానికి సంబందించిన పలు ప్రాజెక్టులు, వాటికి అనుమతులు, నిధుల కేటాయింపుల గురించి అడగనున్నారు. 

ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ తిరుగు ప్రాయానం అయ్యే ముందు కాంగ్రెస్‌ అధిష్టానంతో భేటీ అవుతారు. ఇప్పటికే ఫోన్లో రాహుల్ గాంధీతో ఎస్ఎల్‌బీసీ ప్రమాదం, సహాయ చర్యల గురించి వివరించారు. ఈరోజు కలిసినప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్ధుల ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించనున్నారు.