మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించిన మూడేళ్ళకే మూడు పిల్లర్లు క్రుంగిపోవడానికి మాజీ సిఎం కేసీఆర్, మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు బాధ్యులుగా చేసి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ నాగవెల్లి రాజాలింగమూర్తి అనే వ్యక్తి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో కేసు వేయగా దానిని సవాలు చేస్తూ కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టులో పిటిషన్ వేశారు.
కానీ ఇటీవల రాజలింగ మూర్తి హత్య చేయబడటంతో ఇప్పుడు ఆ కేసు విచారణ చేపట్టాలా వద్దా అనే అంశంపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, కేసీఆర్, హరీష్ రావుల తరపు న్యాయవాదులు భిన్న వాదనలు వినిపించారు.
ఇదొక ప్రజాహిత వాజ్యం కనుక పిటిషనర్ జీవించి ఉన్నాడా లేదా అనేది ముఖ్యం కాదని, అవినీతి జరిగిందా లేదా అనేది నిర్ధారించి, దోషులను చట్ట ప్రకారం శిక్షించబడాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఈ సందర్భంగా ఇటువంటి కేసులపై సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
కేసీఆర్, హరీష్ రావుల తరపు న్యాయవాది రమణారావు కూడా వాదిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పిటిషనర్ మృతి చెందిన్నట్లయితే ఆ కేసులని మూసివేయవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను హైకోర్టు ముందుంచారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జస్టిస్ కే లక్ష్మణ్ తీర్పు వాయిదా వేశారు.