రేవంత్ 36సార్లు ఢిల్లీకి వెళ్ళారు కానీ...

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సిఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు తెలంగాణ భవన్‌లో పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి ఈ 15 నెలల్లో 35సార్లు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. అయినా కనీసం తన మంత్రివర్గంలో ఆరు ఖాళీలను భర్తీ చేసుకోలేకపోయారు. నేటికీ రాష్ట్రానికి హోంమంత్రి లేరు. విద్యాశాఖ మంత్రి లేరు. సంక్షేమ శాఖ మంత్రి లేరు. మరి నెలకు రెండుసార్లు ఢిల్లీకి ఎందుకు పోయి వస్తున్నారో ఆయనకే ఎరుక. 

ఓ పక్క రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరోపక్క ఎస్ఎల్‌బీసీ సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఇవేమీ పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. మళ్ళీ ఇవాళ్ళ మళ్ళీ 36వ సారి ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. రోమ్ నగరం తగులబడుతుంటే ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తిలా ఉంది రేవంత్ రెడ్డి తీరు,” అని ఘాటుగా విమర్శించారు.