మరో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ జారీ

తెలంగాణలో ఒక ఉపాధ్యాయ, రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు గురువారం ఎన్నికలు జరుగుబోతుండగానే, మరో ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మ్రోగింది. ఈసారి ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడానికి ఎన్నికలు జరుగబోతున్నాయి. 

మార్చి 29న ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతీ రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, మీర్జా రియూజుల్ హాసన్, ఎగ్గే మల్లేశం పదవీ కాలం ముగుస్తుంది. కనుక వారి స్థానాలలో ఎమ్మెల్సీలను ఎన్నుకునేందుకు ఈసీ షెడ్యూల్‌ ప్రకటించింది. 

ఎన్నికల షెడ్యూల్‌: 

మార్చి 3 నుంచి 10 వరకు: నామినేషన్స్

మార్చి 13 వరకు: నామినేషన్స్ ఉపసంహరణకు గడువు 

మార్చి 20: ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్

మార్చి 20: సాయంత్రం 5 నుంచి ఓట్లు కౌంటింగ్, ఫలితాల వెల్లడి. 

శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా ఈ ఎన్నికలు జరుగుతాయి కనుక కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలంతో 4 సీట్లు, బిఆర్ఎస్ పార్టీ ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలుచుకోగలవు.

ఈ సీట్లకు 5 నామినేషన్స్ మాత్రమే దాఖలైతే ఎన్నికల అవసరం లేకుండా నామినేషన్స్ ఉప సంహరణ తర్వాత ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్ధులని ప్రకటిస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ 5వ సీటుని కూడా దక్కించుకునేందుకు మరో నామినేషన్ వేస్తే మార్చి 20న పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది.