రోజూ చికెన్, మటన్ బిర్యానీ తిన్నా బోర్ కొట్టేస్తుంది. తెలంగాణలో మందుబాబులు కూడా ప్రతీరోజూ అవే బ్రాండ్స్ మద్యం తాగి తాగి బోర్ కొట్టేసి ఉంటుంది.. అని తెలంగాణ ప్రభుత్వం భావించిందో ఏమో.. రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు దేశ,విదేశీ కంపెనీల నుంచి తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ దరఖాస్తులు ఆహ్వానించింది.
ఇప్పటికే ఇతర రాష్ట్రాలలో మద్యం సరఫరా చేస్తున్న కంపెనీలు నాణ్యత, ప్రమాణాల విషయంలో ఎటువంటి పిర్యాదులు, కేసులు లేవని తెలియజేస్తూ కంపెనీ తరపున ఓ ధృవీకరణ పత్రం కూడా దరఖాస్తుకి జత చేయాలని సూచించింది. కనుక త్వరలోనే తెలంగాణలో దేశవిదేశాలకు చెందిన సరికొత్త మద్యంతో మందుబాబులు గొంతు తడుపుకోవచ్చు.
కాంగ్రెస్ పార్టీ గాంధీజీ ఆశయాలతో పనిచేస్తుందని ఆశించడం అత్యాశ కాదు. గాంధీజీ మద్యపానం తీవ్రంగా వ్యతిరేకించేవారు కనుకనే ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‌లో బీజేపి అధికారంలో ఉన్నప్పటికీ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉంది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కొత్త రకాల మద్యం మందుబాబులకు అందుబాటులోకి తెచ్చి మెప్పించాలనుకుంటోంది.