ఇంకా సొరంగంలోనే 8 మంది.. కొనసాగుతున్న సహాయచర్యలు

ఎస్ఎల్‌బీసీ సొరంగంలోపల 14కిమీ వద్ద పైకప్పు కూలిపోవడంతో లోపల 8 మంది చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కార్మికులు చెప్పిన మాటలు వింటే లోపల చిక్కుకున్న 8 మంది జలసమాధి అయ్యుండవచ్చని అర్దమవుతోంది.

సొరంగంలో చాలా కాలంగా నీళ్ళు కారుతూనే ఉన్నాయని నిన్న తాము లోపలకి వెళ్ళినప్పుడు పైకప్పు కూలిపోయి ఒక్కసారిగా వరద ప్రవహించిన్నట్లు సొరంగంలో భారీగా నీళ్ళు ప్రవహించాయని కార్మికులు చెప్పారు.

ఆ ఉదృతికి కొంతమంది కొట్టుకుపోయారని చెప్పారు. సొరంగం తవ్విన మట్టితో నీరు కలవడంతో నీళ్ళు బురదగా మారాయని చెప్పారు. తాము పనిచేస్తున్న చోటికి మరికొంత దూరంలో ఆ  8 మంది పనిచేస్తున్నారని చెప్పారు.

వారున్న ప్రదేశానికి సమీపంలోనే వరదనీరు ఉబికివచ్చి భారీ సిమెంట్ పలకలతో కూడిన పైకప్పు కూలిపోయింది. కనుక లోపల చిక్కుకున్నవారు ప్రాణాలతో బయటపడితే అది అద్బుతమే అవుతుంది. 

ఈ ప్రమాదం సంగతి తెలియగానే మంత్రులు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు శుక్రవారం మద్యాహ్నం అక్కడకు చేరుకొని సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని మోడీకి ఈ విషయం తెలియడంతో వెంటనే సిఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

సొరంగంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తరపున ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. ఆర్మీ ఇంజనీర్లు, సిబ్బందిని ఉపయోగించుకోమని చెప్పారు. 

యాదాద్రి గోపురం బంగారు తాపటం పనులు పూర్తవడంతో సిఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా యాదాద్రికి వెళ్ళి బంగారరు గోపురాన్ని ఆవిష్కరించారు. ఎస్ఎల్‌బీసీలో ఇంత పెద్ద ప్రమాదం జరిగితే సిఎం రేవంత్ రెడ్డి అక్కడకు వెళ్ళకుండా యాదాద్రి పర్యటనకు వెళ్ళడంపై బిఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది.