నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బాంక్ కెనాల్) ఎడమ వైపు సొరంగంలో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. సొరంగం తొలిచే యంత్రంతో పనులు మొదలుపెట్టిన కొద్దిసేపటికే సొరంగంలో 14వ కిమీ వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది.
అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం కలుగలేదు. స్వల్ప గాయాలతో అందరూ బయటపడ్డారు. గాయపడిన కార్మికులని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఎస్ఎల్బీసీ సొరంగం తొలిచే యంత్రం పాడైపోయినందున చాలా కాలంగా పనులు నిలిచిపోయాయి. మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి చొరవ తీసుకొని విదేశం నుంచి నిపుణులను రప్పించి ఆ యంత్రానికి మరమత్తులు చేయించారు.
నాలుగు రోజుల క్రితమే సొరంగం తొలిచే పనులు మొదలయ్యాయి. సొరంగం తొలిచే పని సజావుగా సాగుతోందని సంతోషపడుతుంటే ఈ ఆటంకం ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సొరంగం వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
నాగార్జున సాగర్ నుంచి నల్గొండ జిల్లాకు గ్రావిటీ పద్దతిలో నీటిని తీసుకువచ్చేందుకు 50.73 కిమీ పొడవైన రెండు సొరంగాలు తవ్వుతున్నారు. సాగర్ నుంచి భారీ పంపులతో నీటిని ఎత్తిపోస్తే అది పుట్టంగండి వరకు చేరుకుంటుంది. అక్కడి నుంచి గ్రావిటీ పద్దతిలో నీళ్ళు ఈ రెండు సొరంగాల ద్వారా నల్గొండ జిల్లాలోని ఆక్కంపల్లి బ్యాలన్సింగ్ రిజర్వాయర్ చేరుకుంటాయి.
ఆ నీటిని నల్గొండ జిల్లా త్రాగు, సాగు నీటి అవసరాలకు ఉపయోగించుకుంటారు. అలాగే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. దాదాపు రెండున్నర దశాబ్ధాలు గడుస్తున్నా వివిద కారాణాల వలన నేటికీ పూర్తవలేదు.
కానీ ఈ ప్రాజెక్టు పూర్తి చేసి నల్గొండ జిల్లాకు నీళ్ళు పారించడమే తన జీవిత లక్ష్యమని, ఎట్టి పరిస్థితులలో వచ్చే ఎన్నికలలోగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి చెపుతున్నారు.