కరోనా వంటి అంతుపట్టని రోగాలకు కూడా హైదరాబాద్ నగరంలోనే వాక్సిన్లు తయారయ్యాయి. భారత్‌తో సహా ప్రపంచ దేశాలకు కూడా ఆ వాక్సిన్లు సరఫరా అయ్యాయి. త్వరలో క్యాన్సర్ మహమ్మారికి కూడా టీకా అందుబాటులోకి రాబోతోంది.
మనుషులకు రోగాలు రాకుండా నివారించేందుకు టీకాలు, వివిద రోగాలకు మందులు తయారుచేసే కంపెనీలు హైదరాబాద్‌లో చాలానే ఉన్నాయి. కానీ పశువులకు మందులు, టీకాలు తయారుచేసే కంపెనీలు కూడా హైదరాబాద్‌లో ఉన్నాయని చాలా మందికి తెలియకపోవచ్చు.
హైదరాబాద్ నుంచి దేశంలో 14 రాష్ట్రాలకు పశువుల మందులు, టీకాలు సరఫరా అవుతున్నాయి. కనుక వీటి ఉత్పత్తి మరింత పెంచాలని భావించిన తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో రూ.300 కోట్ల వ్యయంతో ఓ భారీ టీకాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు.
ఇప్పటికే దీనికి సంబందించిన ప్రతిపాదనలకు పశు సంవర్ధక శాఖ ఆమోదం తెలిపింది. సిఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలుపగానే నిర్మాణ పనులకు టెండర్లు పిలిచేందుకు అధికారులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత దీనికి సిఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.