సిఎం రేవంత్ రెడ్డి నేడు వికారాబాద్, నారాయణ పేట జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం మద్యాహ్నం 12 గంటలకు వికారాబాద్ జిల్లాలోని దుద్యాల మండలం పోలేపల్లి చేరుకొని అక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూజలు చేస్తారు.
అక్కడి నుంచి నారాయణ పేట జిల్లాలోని అప్పక్ పల్లి చేరుకొని అక్కడ మహిళా సంఘం ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకుని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి, వైద్య కళాశాలలోని భవనాలకు శంకుస్థాపన చేస్తారు. మద్యాహ్నం 2 గంటలకు నారాయణ పేటలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
సిఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ళకు శంకుస్థాపన చేసిన తర్వాత, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో కూడా జిల్లా మంత్రులు ఇందిరమ్మ ఇళ్ళకు శంకుస్థాపన చేయగానే వెంటనే నిర్మాణ పనులు మొదలవుతాయి. మిగిలిన ఏడు ఉమ్మడి జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ళకు శంకుస్థాపనలు, ఇప్పటికే పూర్తయినవాటికి ప్రారంభోత్సవాలు చేస్తారు.
ఇందిరమ్మ ఇళ్ళకు మొత్తం 80 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 4.50 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించింది.
మొదటి దశలో మండలానికి ఓ గ్రామం చొప్పున ఎంపిక చేసి 72,045 ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత ఒక్కో నియోజకవర్గంలో ఏడాదికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ళు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.