కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్‌గా జ్ఞానేష్ కుమార్‌

కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రధాన ఎన్నికల కమీషనర్‌గా జ్ఞానేష్ కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాత్రి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. 

కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాజీవ్ కుమార్‌ పదవీ కాలం నేటితో ముగుస్తుంది. కనుక ప్రధాని మోడీ నేతృత్వంలో అమిత్ షా, రాహుల్ గాంధీల త్రిసభ్య కమిటీ సోమవారం సాయంత్రం సమావేశమై ఎన్నికల కమీషన్‌లో సీనియర్ అధికారి అయిన జ్ఞానేష్ కుమార్‌ని కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్‌గా, ఆయన తర్వాత స్థానంలో ఉన్న వివేక్ జోషిని ఎన్నికల కమీషనర్‌గా నియమించాలని నిర్ణయించారు. త్రిసభ్య కమిటీ చేసిన ఈ సిఫార్సుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపి ఉత్తర్వులు జారీ చేశారు. 

కేరళకు చెందిన 1888 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జ్ఞానేష్ కుమార్‌ (61) ఈ పదవిలో 2029 జనవరి 26 వరకు కొనసాగుతారు. జ్ఞానేష్ కుమార్‌ సారధ్యంలో ఈ ఏడాది చివరిలో బిహార్‌ శాసనసభ ఎన్నికలు, వచ్చే ఏడాది జరుగబోయే తమిళనాడు, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. 

ఎన్నికల కమీషనర్‌ వివేజ్ జోషి హర్యాణాకు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమీషనర్‌గా బాధ్యతలు చేపట్టిన జ్ఞానేష్ కుమార్‌ 2029 జనవరిలో పదవీ విరమణ చేస్తారు కనుక 2029 మేలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికలు బహుశః వివేజ్ జోషి ఆధ్వర్యంలో జరుగవచ్చు.