ప్రణీత్ రావు కూడా అవుట్.. కేసు సమాప్తం?

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండో ముద్దాయిగా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావుకి నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ అడిషినల్ ఎస్పీ భుజంగరావు,  అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు బెయిల్‌ మంజూరు అవడంతో బయటకు వచ్చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్నమాజీ డీసీపీ ప్రభాకర్ రావు కేసు నమోదు కాగానే అమెరికా వెళ్ళిపోయారు. అప్పటి నుంచి అక్కడే ఉంటూ అమెరికాలో రాజకీయ ఆశ్రయం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయనని తిరిగి రప్పించేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ఫలించడం లేదు. 

ఈ కేసులో నిందితులు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని, ఎన్నికల సమయంలో పోలీసుల వాహనాలలో డబ్బు తరలించారని ఛార్జ్-షీట్‌లో తీవ్ర అభియోగాలు చేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌పై జైలుకి పంపగలిగారు కానీ ఈ కేసుని ఛేదించి దోషులకు శిక్షలు పడేలా చేయలేకపోయారు. ఈ కేసులో నిందితులు అందరూ బయటకు వచ్చేశారు. కనుక ఇక ఈ కేసు విచారణ మెల్లగా అటకెక్కిపోయిన్నట్లే కనిపిస్తోంది.