సిఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత పార్టీ ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశమవలేదు. కనుక నేటి నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశమవబోతున్నారు.
ఈరోజు ముందుగా ఈరోజు మద్యాహ్నం 3 గంటలకు మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ముందుగా ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలతో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, జిల్లా మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.
తర్వాత ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల ఎమ్మెల్యేలతో, చివరిగా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశంఅవుతారు.
రెండు రోజుల క్రితం ఓ స్టార్ హోటల్లో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారు. ఇది పార్టీలో కలకలం సృష్టించింది. అ రహస్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలతో కూడా నేడు సిఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు.
ప్రభుత్వ పధకాల అమలు, వాటిపై మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకుంటారు. సమగ్ర కుల గణనపై పార్టీలో కొందరు వ్యతిరేకంగా మాట్లాడుతూ పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగిస్తుండటంపై కూడా సిఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో ప్రస్తావించి ఎమ్మెల్యేలను గీత దాటవద్దని హెచ్చరించే అవకాశం ఉంది.
త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ పరంగా చేయాల్సిన సన్నాహాలు, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాల గురించి ఈ సమావేశాలలో సిఎం రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు.