నేడే ఢిల్లీ శాసనసభ ఎన్నికలు

ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది. ఢిల్లీ శాసనసభలో 70 స్థానాలకు అధికార ఆమాద్మీ, బీజేపి, కాంగ్రెస్‌ పార్టీలతో సహా మొత్తం 699 మంది పోటీ చేస్తున్నారు. ఢిల్లీలో ఇంకా చలి ఎక్కువగానే ఉన్నప్పటికీ తెల్లవారుజాము 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ కట్టడం విశేషం. 

ఢిల్లీలో మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లున్నారు. వారి కోసం 70 నియోజకవర్గాలలో 13,766 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఈసీ. 

దాదాపు పదేళ్ళకు పైగా ఆమాద్మీ పార్టీ అధికారంలో ఉంది. యావత్ దేశాన్ని పాలిస్తున్న బీజేపి దానిని ఓడించేందుకు గత ఎన్నికలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరికి మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, డెప్యూటీ సిఎం మనీష్ సిసోడియాలని అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టింది కూడా. అయినా అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎప్పటికప్పుడు బీజేపి అధిష్టానం కూడా ఊహించలేని పైఎత్తులు వేస్తూ దూసుకుపోతున్నారు. 

జైల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా, బయటకు రాగానే రాజీనామా చేసి ప్రజల మద్యకు వెళ్ళారు. తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని ప్రజలు కూడా నమ్మి మళ్ళీ గెలిపిస్తేనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటానంటూ ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఈసారి ఎట్టి పరిస్థితులలో ఆమాద్మీ పార్టీని ఈ  ఎన్నికలలో ఓడించి అధికారం చేజీకిన్చుకోవాలని బీజేపి చాలా పట్టుదలగా ఉంది. 

అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమాద్మీ పార్టీతో రాజకీయ ప్రవేశం చేసేవరకు 15 ఏళ్ళు ఏకధాటిగా ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఢిల్లీ పీఠం దక్కించుకోలేకపోతోంది. కనుక అది కూడా ఈసారి ఎలాగైనా ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాలని సర్వ శక్తులు ఒడ్డి పోరాడుతోంది. 

కనుక ఢిల్లీ శాసనసభ ఎన్నికలు మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. వీటిలో ఏ పార్టీ గెలుస్తుందో ఈ నెల 8న ఫలితాలు వెలువడితే తెలుస్తుంది.