నేడు తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశం జరుగబోతోంది. ఇటీవల జరిపిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికని శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించేందుకు నేడు ఈ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు.
ఈరోజు ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశం ప్రారంభం అవుతుంది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు కూడా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపినందున ఈరోజు సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై కూడా చర్చించనున్నారు. సమావేశంలో రిజర్వేషన్స్ గురించి చర్చించిన తర్వాత విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్స్ అమలుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే అంతా కాకి లెక్కలేనని దానికి ఎటువంటి విలువ లేడని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్రంలో పదేళ్ళలో కేవలం 11.4 లక్షల మంది మాత్రమే బీసీ జనాభా పెరిగిందని, ఎస్సీ జనాభా 2.6 లక్షలు తగ్గిందని నివేదికలో పేర్కొనడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.
పదేళ్ళ తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర జనాభా 3.70 కోట్లు అంటే నమ్మశక్యంగా లేదన్నారు. ఇటువంటి కాకి లెక్కల నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు అమలుచేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెపుతుండటాన్ని కల్వకుంట్ల కవిత ఆక్షేపించారు. కేటీఆర్, హరీష్ రావులు కూడా ఈ నివేదికపై తీవ్ర అభ్యంతరాలు తెలిపారు.
అయితే ఈ సర్వేలో పాల్గొని తమ కుటుంబ వివరాలు ఈయని వారిరువురికీ దాని గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దమ్ముంటే కేసీఆర్ ఇవాళ్ళ శాసనసభకు వచ్చి మాట్లాడాలని సవాలు చేశారు.