కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు, కొత్తగా ప్రాజెక్టులు కేటాయించకపోవడాన్ని సిఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు భగ్గుమన్నారు. కేంద్ర బడ్జెట్‌పై నిన్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశమై చర్చించిన తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ పట్ల కేంద్రం ఎప్పుడూ వివక్ష చూపుతూనే ఉంది. మరోసారి చూపింది. రాష్ట్రంలో నుంచి పన్నుల రూపేణా కేంద్రానికి వెళుతున్నదానికి, అది రాష్ట్రానికి తిరిగి ఇస్తున్నదానికీ ఎక్కడ పొంతన లేదు.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి తోడ్పడక పోగా ఈవిదంగా బ్రేకులు వేస్తుండటం చాలా దురదృష్టకరం. ఓ పక్క సెస్సులు పెంచి రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయాన్ని తగ్గిస్తూ, మరోపక్క కేంద్ర పధకాలకు నిధులు పెంచి కేంద్రంపై ఆధారపడేలా చేసుకుంది. ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోంది.
ఈ ఏడాది చివరిలో బిహార్ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక ఆ రాష్ట్రం కోసమే బడ్జెట్ రూపొందించిన్నట్లు అనిపిస్తోంది. బడ్జెట్‌లో నిధులు, ప్రాజెక్టులు అన్నీ ఆ రాష్ట్రానికే ముట్టజెప్పింది. తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది బీజేపి ఎంపీలను గెలిపించి ఇస్తే తెలంగాణకు ఇంత అన్యాయం చేస్తారా?
బడ్జెట్ రూపొందించే ముందే సిఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సరిపడా నిధులు, కొత్త ప్రాజెక్టులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కానీ ముఖ్యమంత్రి అభ్యర్ధనని కూడా వారు పట్టించుకోలేదు. దీనిపై ఏవిదంగా ముందుకు సాగాలో చర్చించుకొని త్వరలో నిర్ణయం తీసుకుంటాము,” అని భట్టి విక్రమార్క చెప్పారు.
బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు చేస్తున్నాయి.